అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్‌

రాజమండ్రి: బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే దిశ చట్టం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దిశ చట్టం దేశంలోనే ప్రత్యేకమైనదని తెలిపారు. శాంతి భద్రతలే తమ మొదటి ప్రాధాన్యం అని.. ముఖ్యంగా మహిళల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాజమండ్రిలో ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను సీఎం జగన్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దిశ యాప్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి సహా డీజీపీ గౌతం సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.











ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మద్యం సేవించి రాక్షసులుగా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని.. అయితే సినిమాల్లో చూపించినట్లుగా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయని పేర్కొన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.